
హైదరాబాద్, 09 మే (హి.స.)టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె.. భారీగా ఖర్చు చేసినా రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. రిజర్వాయర్లు నిర్మించడం మాత్రమే సరిపోదని, నీళ్లు పొలాల వరకు చేరాలంటే కాలువలు కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదని విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి తగిన న్యాయం జరగలేదని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్కు 12 సీట్లు ఇచ్చినా అభివృద్ధి పనులు కనిపించలేదని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. అలాగే జనగణనలో కులగణన నిర్వహించాలని, రాష్ట్రం పంపిన బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు.
కృష్ణా నది తెలంగాణలో ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీళ్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధిపైనే కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని పేర్కొన్న కవిత.. త్వరలో మరో నీటి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్