
వీర్నపల్లి, 09 మే (హి.స.)పండించిన ధాన్యం తూకాలు వేసేందుకు రైతులు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మక్కల కొనుగోళ్లకు కనీసం గన్నీ బ్యాగులు సరఫరా చేసే సోయి ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందల సంఖ్యలో వాహనాలతో మార్కెట్ల ఎదుట అన్నదాతలు పడిగాపులు కాస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి కుర్చీలు కాపాడుకునేందుకు దిల్లీకి మూటలు మోస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారాస హయాంలో అడగకుండానే రైతు బంధు వేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు.
పంచాయతీ ఎన్నికల ముందు, కేసీఆర్ సభ పెడుతున్న సందర్భంగా రైతుబంధు పంపిణీ చేశారంటూ కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. సమ్మక్క-సారలమ్మ జాతర పనుల్లో వాటాల కోసం మంత్రులు కొట్లాడుకున్నారని విమర్శించారు. కొత్త పథకాల మాట అటుంచితే.. ఉన్నవి కూడా తొలగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 420 హామీలపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, వీటికి జంకే ప్రసక్తే లేదన్నారు. జడ్పీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మత రాజకీయాలు తప్ప.. ప్రజాసంక్షేమం, రైతుల సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్