
సంగారెడ్డి, 09 మే (హి.స.)కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ వ్యాఖ్యానించారు. ఈరోజు(శనివారం) ఉదయం కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్ నుంచి క్రిశాంక్ విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ ఏటీఎం కాద్ద కాల్పులు జరిపి దొంగలు పారిపోయారని, కరీంనగర్ జ్యువెలరీ షాపులో దొంగలు కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లారని అన్నారు.
సీపీ సుమతికి అర్ధరాత్రి రక్షణ లేకుండా పోయిందని క్రిశాంక్ అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లోనే రక్షణ లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై కాకుండా శాంతి భద్రతలపై దృష్టి సారించాలని హితవుపలికారు. మీడియా వాళ్లతో కూడా మాట్లాడితే ఎందుకు మాట్లాడావని అడుగుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్, వైఫై హ్యాకింగ్ చేస్తుందన్న అనుమానం కలుగుతోందని క్రిశాంక్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్