తుమ్మిడిహట్టి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నయా నాటకం'.. హరీష్ రావు
తుమ్మిడిహట్టి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నయా నాటకం'.. హరీష్ రావు
Harish Rao


సిద్దిపేట, 09 మే (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మేడిగడ్డ మూడు పిల్లర్లను మరమ్మతులు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని.. తుమ్మిడిహట్టి పేరిట నయా నాటకానికి తరలిపారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే 150 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం పచ్చి అబద్దమన్నారు. తమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని మంత్రి జూపల్లి, 9:30 నుంచి సుందిళ్లకు నీళ్లు తెస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9:30 నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో ఎవరికి తోచిన విధంగా వారు మతి లేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

150 మీటర్లకు నాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తుమ్మిడిహట్టి వద్ద కాకుండా ప్రాణహిత వద్ద పనులు ఎందుకు ప్రారంభించారని సూటిగా ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానడం హాస్యాస్పదం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు. తుమ్మిడిహట్టి సర్వే మొబిలైజేషన్ పేరిట రూ.2300 కోట్ల బిల్లులు ఎత్తిన ఘనత కాంగ్రెస్ నాయకులది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ చేసి మాట్లాడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే అన్నారు. కాళేశ్వరంలో కొలువై ఉన్న ముక్తేశ్వరుడు వారిని శిక్షిస్తాడని హెచ్చరించారు. మేడిగడ్డను రిపేరు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని హరీష్ రావు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande