
పెద్దపల్లి, 09 మే (హి.స.)
ధాన్యం అన్ లోడింగ్ను రెట్టింపు
వేగంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామ రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం అన్లోడింగ్, నిల్వలు, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైస్ మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను వెంటనే పెంచి అన్లోడింగ్ ప్రక్రియను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలిస్తున్న నేపథ్యంలో మిల్లుల వద్ద ఎటువంటి ధాన్యం కోతలు విధించరాదని స్పష్టం చేశారు.
ట్రక్ షీట్లు వెంటనే జనరేట్ చేయాలని, ట్యాబ్ ఎంట్రీలు 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సంబంధించిన చెల్లింపులు త్వరితగతిన వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఏడు రోజులలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ధాన్యం తడవకుండా అన్ని రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా నిల్వ ఉంచాలని, అవసరమైన రవాణా వాహనాలు
అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..