
హైదరాబాద్, 09 మే (హి.స.)
ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాదు రానున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకులు.. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతకుముందు హెచ్ఐసీసీలో దాదాపుగా రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.
జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ.2,360 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు రూ.3,175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూర్-మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.1,243 కోట్లతో చేపట్టనున్న కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. రూ.200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కు సైతం శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని పర్యటన ఇలా..
కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలీకాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటలకు హెచ్ఐసీసీలో పలు కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి కొద్దిసేపు ప్రసంగిస్తారు.
సాయంత్రం 4.10 గంటలకు హైటెక్ సిటీ ప్రాంతంలో నిర్మించిన సింధూ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.
5.10 గంటలకు హెలీకాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు.
అనంతరం 6.30 నుంచి 7.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.
-రాత్రి 7.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ పోర్ట్కు బయలుదేరుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..