
రాజన్న సిరిసిల్ల, 09 మే (హి.స.)
సమగ్ర, కచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మొదటి దశ జనగణన పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై, జనగణన పై క్షేత్ర స్థాయి ప్రచారం, అవగాహన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2కె వాక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. స్వీయ గణన అనే విధానం తొలిసారిగా ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. . స్వీయ గణన కోసం https://se.census.gov.in సైట్ లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
స్వీయ గణన చేయడానికి ఆదివారం తుది గడువు అని, స్వీయ గణనలో పాల్గొని వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం నుంచి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం సిబ్బందిని జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి, వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు.
జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు