
విశాఖపట్నం, 09 మే (హి.స.)
: రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగురోడ్డు నిర్మిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కి.మీ మేర రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘నగరం అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ అవసరం. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించాం. మాస్టర్ప్లాన్ అంశంలో వచ్చిన వినతులపై ఈ సమావేశంలో చర్చించాం. ఎమ్మెల్యేల నుంచి అందిన వినతుల్లో 90 శాతం పరిష్కరించాం. 6,836 చదరపు కి.మీ పరిధిలో వీఎంఆర్డీఏ విస్తరించి ఉంది. ఈనెల చివరి నాటికి సెమీ రింగురోడ్డు డీపీఆర్ సిద్ధమవుతుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు ఏడు కనెక్టింగ్ రోడ్లను వీఎంఆర్డీఏ నిర్మిస్తోంది. ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్టుకు బీచ్ కారిడార్ ప్రతిపాదన ఉంది. రూ.14వేల కోట్లతో తాగునీటి ప్రాజెక్టు వస్తోంది. ఇది పూర్తయితే 95 శాతం ఇళ్లకు తాగునీరు అందుతుంది’’ అని మంత్రి నారాయణ వివరించారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ ఎకనామిక్ కారిడార్ ఆధారంగా సమీక్ష సమావేశం జరిగిందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్గా మారుతోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ