
హైదరాబాద్, 09 మే (హి.స.)రాష్ట్ర చరిత్రలో డిస్కంలు తొలిసారి సొంతంగా సౌర(సోలార్) విద్యుదుత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతున్నాయి. సాధారణంగా డిస్కంలు కరెంటు ఉత్పత్తి చేయవు. జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తయిన కరెంటును కొని ప్రజలకు విక్రయించే వ్యాపారం చేస్తాయంతే. దీనికి పూర్తి భిన్నంగా అవి నేరుగా విద్యుదుత్పత్తి ప్లాంట్లను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొమ్మిది పాత ఉమ్మడి జిల్లాల్లో 18సబ్స్టేషన్ల పక్కనున్న స్థలాల్లో నిర్మించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. మొత్తం రూ.66.50 కోట్ల వ్యయంతో 19 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో వీటిని నిర్మించాలనేది ప్రణాళిక. తొలుత నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి సబ్స్టేషన్ వద్ద ఇప్పటికే సోలార్ ప్లాంటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని సబ్స్టేషన్ వద్ద స్థలం లేకపోవడంతో అక్కడికి 600మీటర్ల దూరంలో ఖాళీగాఉన్న 4ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నిర్మాణ పనులను పూర్తిచేయడానికి రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించారు. డిస్కంలే సొంతనిధుల నుంచి పూర్తివ్యయాన్ని భరిస్తాయి.
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో సౌర విద్యుత్ను యూనిట్ను రూ.2.60 వరకు పెట్టి డిస్కంలు కొంటున్నాయి. అక్కడి నుంచి తెలంగాణలోని వినియోగప్రాంతాల వరకు సరఫరాకు లైన్ రవాణా కిరాయిలు, పంపిణీలో నష్టాలను కూడా లెక్కిస్తే యూనిట్ వ్యయం రూ.3.50కి చేరుతోంది. ఇలా కాకుండా నేరుగా మనవద్దనే సోలార్ ప్లాంట్లు ఉంటే పంపిణీలో నష్టాలు, లైన్ రవాణా వ్యయం తగ్గుతాయి. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ-2025లో భాగంగా రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్