
పీలేరు (అన్నమయ్య), 09 మే (హి.స.) : పీలేరులో అన్నమయ్య జిల్లా అగ్నిమాపక అధికారి వి. ఆదినారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన స్థానిక జివిసిఎస్ఆర్ సినిమా థియేటర్ కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన సినిమా థియేటర్లలోని అగ్నిమాపక నివారణ ఏర్పాట్లు, పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా థియేటర్లో అగ్నిమాపక రక్షణ చర్యల్లో భాగంగా ఎన్ఓసి రెన్యువల్ కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకుందని, ఎన్ఓసి ఇవ్వడానికి ముందస్తు తనిఖీల కోసం తాము వచ్చామని అన్నారు. థియేటర్ యాజమాన్యం సినిమా థియేటర్ ఆధునికరించడంతో పాటు అగ్నిమాపక రక్షణ చర్యలు కూడా చక్కగా తీసుకున్నారని జిల్లా అగ్నిమాపక అధికారి సంతృప్తిని వ్యక్తం చేశారు.
సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల ప్రాణ రక్షణ కోసం అగ్నిమాపక రక్షణ చర్యలు, అనుమతులు చట్టపరంగా తప్పనిసరి అని అన్నారు. థియేటర్లలో ఎక్కువమంది ప్రేక్షకులు ఉంటారని, దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వారు సురక్షితంగా బయటపడేందుకు తగిన సురక్షిత మార్గాలు, ఫైర్ అలారాలు, వాటర్ స్ప్రింక్లర్లు వంటివి కచ్చితంగా ఏర్పాటు చేసి ఉండాలని అన్నారు. సహజంగా ప్రొజెక్టర్లు, ఎలక్ట్రికల్ ప్యానెల్లు, ఫుడ్ కోర్టులు, సీట్లు, తెరలు వంటివి సులభంగా మంటలకు గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి సినిమా థియేటర్లలో నివారణ ఆచార్యులు తప్పనిసరి అని అన్నారు. అందుకోసం తాము ఫైర్ సేఫ్టీ ఆడిట్ ద్వారా థియేటర్లలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవలసిన అవసరం తమ శాఖకు ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పీలేరు అగ్నిమాపక అధికారి సి. భాస్కర్ రెడ్డి, సిబ్బందితోపాటు సినిమా థియేటర్ నిర్వాహకులు అమర్నాథ్ రెడ్డి, మేనేజర్ సురేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV