
ఆదిలాబాద్, 09 మే (హి.స.)
తెలంగాణ కశ్మీర్'గా పేరుగాంచిన ఆదిలాబాద్లో సూర్యుడు రగిలిపోతున్నాడు. భానుడి ఎండ తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రతిరోజు 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో బయట జనాలు కనిపించడమనేది గగనమైపోయింది. పచ్చని చెట్లు, ప్రకృతి సోయగాలతో నిండిపోయిన జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావం చిన్న నుంచి పెద్దల వరకు అందరిపై పడి, ఆసుపత్రలలో చికిత్స తీసుకునేలా చేస్తుంది.
జిల్లాలోని కోలిపురకు చెందిన హురేర్(11), ఖతీజ(9)లు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఇద్దరు పిల్లలకు వారం రోజుల నుంచి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. వారిని వారం రోజుల కిందట రిమ్స్ పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అధికమైన ఎండల కారణం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు చెప్పారు.
వేడిగాలుల వల్ల పిల్లలకు డయేరియా : గడిచిన కొంత కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది వడదెబ్బను ఎదుర్కొంటున్నారు. కొందరైతే వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అస్వస్థతకు గురవుతున్నవారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంది. పిల్లలు నీడలో ఉన్నప్పటికీ కూడా వేడిగాలులు వీయడం వల్ల డయేరియాతో బాధ పడుతున్నారు. ఏప్రీల్ నెలలో జిల్లాలోని నిమ్స్ హాస్పిటల్లో 6,066 మంది ఈ లక్షణాలతో చికిత్సలు పొందారు. బోథ్ సీహెచ్సీకి అయితే ప్రతి రోజూ 250 మంది బాధితులు వస్తున్నారు. వీరిలో 40 మంది వరకు ఎండల వల్ల అనారోగ్యంతో వచ్చినవారే ఉంటున్నారు.
అస్వస్థతకు గురైన తొమ్మిది నెలల పాప : ఎండదెబ్బకు తొమ్మిది నెలల పాప 'ప్రియాంక' వాంతులు చేసుకుంది. తనని ఈ నెల 2న రిమ్స్లో చేర్పించారు. ఎండ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల పాపకి వాంతులతో పాటుగా జ్వరం వచ్చిందని డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రియాంక శరీరంపై ఎర్రని దద్దుర్లు కూడా ఏర్పడ్డాయి. కేవలం జిల్లాలోనే కాదు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సూర్యుడి తీవ్రత అధికంగా ఉంది. గాదిగూడ, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ వంటి మండలాల ప్రజలు వడదెబ్బను ఎదుర్కొంటున్నారు. ఉట్నూరు ప్రభుత్వ హాస్పిటల్కి రోజూ 400 మందికి పైగా ప్రజలు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో కొందరు వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi