
సూర్యాపేట, 09 మే (హి.స.)
అసాంఘిక కార్యకలాపాలు, కొత్త
వ్యక్తుల కదలికల నిర్మూలన, నేరాల నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి సూర్యాపేట పట్టణ పోలీసులు లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలో గల అన్ని లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అందులో ఆశ్రయం తీసుకున్న వ్యక్తుల ఆధారాలను తనిఖీ చేశారు.
గతంలో ఏమైనా నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందా అని ఆరా తీశారు. ఇలాంటి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం వల్ల కొత్త వ్యక్తుల కదలికలను నిర్మూలించవచ్చునని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు లాడ్జిలలో ఆశ్రయం ఇవ్వకూడదని రూములు ఇవ్వకూడదని యజమానులకు సూచించారు. ఎక్కువ రోజులు ఒకే వ్యక్తికి లాడ్జి ఇవ్వకూడదని ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. లాడ్జిలను హోటల్స్ ను ఆశ్రయంగా చేసుకొని నేరాలకు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..