
నెల్లూరు , 09 మే (హి.స.)
నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అతివేగంగా ఉండటమా లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV