
రాజన్న సిరిసిల్ల , 10 జూన్ (హి.స.)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మారుస్తున్నాయని సీపీఐ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సీపీఐ పార్టీ పిలుపు మేరకు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు.
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపుతూ ఒకవైపు ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని నాయకులు ఆరోపించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపు తప్పుతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా ధరలను నియంత్రించి, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..