
విజయవాడ .
, 12 జూన్ (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల విజయవంతం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే హింసాత్మక రాజకీయాలకు పాల్పడిందని సజ్జల ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో లభించిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని, చెప్పుకోదగ్గ పాలన అందించడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ఆదర్శవంతమైన పాలన సాగిందని సజ్జల పేర్కొన్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పటికే అమలులో ఉన్న అనేక పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. గత రెండేళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, జగన్ పాలన విలువ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం చట్టాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలకు చూపించగలిగే అభివృద్ధి ఏదీ లేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు