
ఏలూరు, 11 జూన్ (హి.స.)
, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై పూనెం వంశీ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. దీనిపై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో వంశీని పోలీసులు నిన్న(బుధవారం) పోలీస్స్టేషన్కు పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న వంశీ ఈరోజు(గురువారం) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి నానా హంగామా చేశాడు.
ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆయనపై దాడి చేసేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్మెన్.. వంశీని అడ్డుకున్నారు. ఆపై క్యాంపు ఆఫీసు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ