
అమరావతి, 11 జూన్ (హి.స.)
రంగశాయిపేట, ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను బెదిరించి.. దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను మిల్స్కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ స్వామి నిందితుల వివరాలను వెల్లడించారు. కాజీపేటకు చెందిన బౌరి పవన్సింగ్, బౌరి రవీందర్సింగ్, బౌరి సికిందర్సింగ్ ఈ నెల 7న ఉర్సుగుట్ట ప్రాంతంలో ఓ యువతి, యువకుడు ద్విచక్ర వాహనంపై నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లడాన్ని గమనించారు. ముగ్గురు యువకులు అక్కడికి వెళ్లి జంటను చుట్టిముట్టి తమ చరవాణిలో ఫొటోలు, వీడియోలు తీసి మీ తల్లిదండ్రులకు పంపుతామని బెదిరించారు. డబ్బులు డిమాండ్ చేశారు. తమవద్ద లేవని చెప్పిన యువకుడిపై దాడి చేశారు. బంగారు, వెండి ఉంగరాలు లాక్కొని, యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దోచుకున్న వస్తువులను బుధవారం వరంగల్లో అమ్మేందుకు వచ్చిన పవన్సింగ్, రవీందర్సింగ్, సికిందర్సింగ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి బంగారు, వెండి ఉంగరాలు, మూడు చరవాణులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ