
జగిత్యాల, 11 జూన్ (హి.స.)
చివరి దశ ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో చివరి దశలో ఉన్న వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా బీర్ పూర్ మండల కేంద్రం, నరసింహుల పల్లి గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీ సత్యప్రసాద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ, ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు విక్రయించిన ధాన్యం సకాలంలో మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు