
హైదరాబాద్, 11 జూన్ (హి.స.) ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దారుణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆ బాలిక పురుషులైన డాక్టర్లను కూడా దగ్గరికి రానివ్వడం లేదని వైద్యులు చెప్తున్నారంటే, ఆ బాలిక ఎంత భయపడిందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మగవాళ్లెవరైనా హెచ్ఓడీస్ కానీ, ఆర్ ఎంవోలు కానీ,డాక్టర్లు కానీ వస్తే బాలిక భయబ్రాంతులకు లోనవుతుంది. అంటే అంత ఘోరంగా ఆ చిన్న అమ్మాయిని చిత్రహింసలు పెట్టారని అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు స్పందిస్తలేదని అడిగారు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలకు రక్షణ కరువైపోయిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆడపిల్లలను ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్టు అనిపిస్తలేదన్నారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఆ పక్కనే ఉన్న వరంగల్లో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు కూడా స్పందిచలేరని మండిపడ్డారు, ఒక బాలికకు ఇలా జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మహిళా మంత్రులు ఒక్కరు కూడా ఎందుకు స్పందించడం లేదు.? ప్రభుత్వం వెంటనే స్పందించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు