మెదక్ ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : కలెక్టర్ ప్రతిమా సింగ్
కలెక్టర్


మెదక్, 11 జూన్ (హి.స.)

చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం మెదక్ ఖిల్లాను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.మెదక్ జిల్లాకు చారిత్రక వారసత్వంగా నిలిచిన మెదక్ ఖిల్లాలో పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఖిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి, రహదారుల మెరుగుదల, పార్కింగ్ సదుపాయాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి కేంద్రాలు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా ఖిల్లా చరిత్రను సందర్శకులకు తెలియజేసే విధంగా సమాచార బోర్డులు, దిశానిర్దేశక సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే సాంస్కృతిక, వారసత్వ కార్యక్రమాలను నిర్వహిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ ఖిల్లా అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల సహకారంతో మెదక్ ఖిల్లాను తెలంగాణలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande