ప్రయాణికుల కష్టాలకు చెక్...హుస్నాబాద్ బస్ స్టేషన్కు నూతన శోభ!
ప్రయాణికుల కష్టాలకు చెక్...హుస్నాబాద్ బస్ స్టేషన్కు నూతన శోభ!
Minister


హుస్నాబాద్, 11 జూన్ (హి.స.)

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో

రద్దీగా ఉండే హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణికుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. బస్ స్టేషన్లో ప్రయాణికులను అడిగి సమస్యలను తెలుసుకున్న మంత్రి, తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి వర్షాకాలంలో బస్ స్టేషన్ ప్రాంగణం జలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని శాశ్వతంగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బస్ స్టేషన్ వెనుక ఉన్న నాలాను, ప్రధాన రహదారి డ్రైనేజీకి అనుసంధానిస్తూ 'అండర్ గ్రౌండ్ డ్రైనేజీ' వ్యవస్థను నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రజాధనం వృథా కాకుండా, పక్కా ప్రణాళికలతో ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ బస్ స్టేషన్ అత్యధిక ఆదాయం వస్తున్న ఏ-కేటగిరీ స్టేషన్లలో ఒకటి. రోజుకు 35 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా స్టేషన్ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతాం. కేవలం బస్ స్టేషన్ మాత్రమే కాదు.. హుస్నాబాద్ను ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తూ, విద్యా, వైద్య, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం అని పేర్కొన్నారు.

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ, హుస్నాబాద్ బస్ స్టేషనను ఒక పెద్ద షాపింగ్ మాల్ను తలపించేలా ఆధునీకరిస్తాం. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. స్థానిక షాపుల యజమానుల సహకారంతో ఈ ప్రాంగణాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాం అని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande