తుడా నిధులను దుర్వినియోగం చేశారు
తుడా నిధులను దుర్వినియోగం చేశారు
తుడా నిధులను దుర్వినియోగం చేశారు


అమరావతి, 12 జూన్ (హి.స.)

అధికారం వారిదే.. కంపెనీలూ వారివే.. కాంట్రాక్టులూ సొంతానికే! గత ప్రభుత్వంలో తుడా చైర్మన్లుగా వ్యవహరించిన తండ్రీకొడుకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహిత్రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారం వాడేశారు. తుడా నిధులతో చేపట్టిన అన్ని పనుల్లోనూ అంతులేని దోపిడీ.. నిబంధనల ఉల్లంఘనలే. దీనికితోడు నిధులనూ దారి మళ్లించారు. ఈ అక్రమాలకు అధికారులు వంత పాడారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) నిధులను దుర్వినియోగం చేసిన మాజీ చైర్మన్లు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మోహిత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. దుర్వినియోగం చేసిన నిధులను వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

ఐదుగురు తుడా అధికారులపై సీసీఏ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, తొమ్మిదిమంది ఎంపీడీవోలపై చర్యలు చేపట్టాలని సూచించారు. తుడా పరిధిలో ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చేసిన పనులన్నీ సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మాత్రమే నిర్వహించింది. ఈ సంస్థకు చెవిరెడ్డి రెండో కుమారుడు హర్షిత్రెడ్డి ఎండీగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాగా విజిలెన్స్ విచారణకు తొలుత కొందరు తుడా సిబ్బంది సహకరించలేదు. విజిలెన్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పేందుకు నిరాకరించారు.

దీనిపై ఉన్నతస్థాయి నుంచి హెచ్చరికలు జారీ కావడంతో తుడా అధికారులు దారికి వచ్చారు. ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీబీ అధికారులు మరో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఏసీబీ విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉందని భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande