
అమరావతి, 12 జూన్ (హి.స.)
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల ఐటీ రంగంలో పోతున్న ఉద్యోగాలకు మించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ఎండీ, అధ్యక్షుడు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఐటీ రంగ ఉద్యోగాలను ఏఐ తుడిచిపెట్టేస్తుందనే భయాలను వీడి, ఏఐతో కలిసి పనిచేయడంపై భారతీయ ఇంజినీర్లు దృష్టి పెట్టాలని గురువారం తన బ్లాగ్ పోస్ట్లో రాజీవ్ సూచించారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, టెక్నికల్ నైపుణ్యాల కాలపరిమితి తగ్గిపోతోందని.. అందుకే నిరంతరం నేర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా మారడం ఉద్యోగులకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 గణాంకాలను ఈ సందర్భంగా రాజీవ్ ప్రస్తావించారు. దీని ప్రకారం.. 2030 నాటికి 39% కోర్ ఉద్యోగ నైపుణ్యాలు మారిపోనున్నాయి. ముఖ్యంగా మన దేశంలో 2030కి దాదాపు 63% మంది ఉద్యోగులకు భారీ స్థాయిలో నైపుణ్యాల మెరుగుదల లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరమవుతాయని అంచనా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ