
ఖమ్మం, 12 జూన్ (హి.స.)
కేంద్రంలో అధికారంలో ఉన్న
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐర్)పై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బి.ఎల్.ఏ) అవగాహన శిక్షణ శిబిరం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో గల పీవీఆర్ గార్డెన్స్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ రాజకీయ వ్యూహాలను ఎండగడుతూ సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్ఐర్' ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ ఒక పద్ధతి ప్రకారం.. దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను 'ఫేక్ ఓట్లు'గా చిత్రీకరించి, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోంది. ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటన్నింటినీ వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలి” అని మంత్రి పిలుపునిచ్చారు
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వాడుకుంటోందని మంత్రి తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న సీబీఐ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ సంస్థలను అడ్డం పెట్టుకుని, వేరే పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసున్నారని
మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, భారతదేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా ఇదే రకమైన దుర్మార్గపు పరిపాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే 'ఓట్ మ్యాపింగ్' ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగాలు, చదువుల రీత్యా ఖమ్మం, హైదరాబాద్లలో ఉండే మన వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలి. మనకు దొంగ ఓట్లు అవసరం లేదు.. మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ ఒక కాంక్రీట్ గోడ లాగా కాపాడుకోవాలి” అని స్పష్టం చేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కాబోయే ప్రధానమంత్రి, మన నాయకుడు రాహుల్ గాంధీకి కార్యకర్తలంతా సైనికుల్లా అండగా నిలబడాలని, ఈ అక్రమ ఎస్ఐఆర్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు