
జనగామ, 12 జూన్ (హి.స.)
జనగామ-సూర్యాపేట జాతీయరహదారిపై లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని నవాబుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ, సూర్యాపేట నుంచి జనగామ వైపు వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హనుమకొండ జిల్లా లస్కర్బజార్కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ (28), కాజీపేటకు చెందిన కారు డ్రైవర్ మహమ్మద్ సుభాన్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన మహమ్మద్ మసీద్, సమీర్, ఖమ్మం జిల్లాకు చెందిన మహమ్మద్ నూర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తొలుత జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమారం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతులు మరియు గాయపడిన వారు వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..