
హనుమకొండ, 12 జూన్ (హి.స.) హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎస్ఏ) శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. ప్రతి బూత్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు హక్కు పరిరక్షణకు యోధుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ విజయానికి ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అనేక ప్రాంతాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరిగాయని, ఇప్పటి వరకు ఓటు వేశాం కదా అనే నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరమని హెచ్చరించారు. రేపు ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రజాస్వామ్య హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల పాటు బీఎల్ఎలు, బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, అన్యాయంగా తొలగించబడిన పేర్ల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..