యాచారం లో టిప్పర్.బైక్ ల ప్రమాదం తల్లి మృతి
యాచారం లో టిప్పర్.బైక్ ల ప్రమాదం తల్లి మృతి
యాచారం లో టిప్పర్.బైక్ ల ప్రమాదం తల్లి మృతి


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)యాచారం, అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుమారుడు ద్విచక్రవాహనంపై ఆమెను ఎక్కించుకొని ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స అనంతరం ఇద్దరూ ఇంటికి వస్తుండగా.. ముందు వెళ్తున్న టిప్పర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసి.. రివర్స్ తీసుకోవడంతో బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో చక్రాల కింద నలిగి తల్లి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. కుమారుడి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్స్టేషన్ సీఐ సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం బేగరి కంచ నివాసి భారతమ్మ(45)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుమారుడు అఖిల్తో కలిసి ద్విచక్రవాహనంపై ఆకులమైలారంలోని ఆసుపత్రికి వెళ్లారు.

అనంతరం ఇంటికి తిరిగొస్తున్నారు. ఆకులమైలారం సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఎదురుగా వస్తున్న మరో టిప్పర్కు దారి ఇవ్వడానికి బ్రేక్ వేశాడు. అఖిల్ ద్విచక్రవాహనాన్ని టిప్పర్ వెనుక నిలిపాడు. దీన్ని గమనించని డ్రైవర్ టిప్పర్ని వెనక్కి తీయగా.. బైకుకు తగిలింది. వెనుక కూర్చున్న భారతమ్మ టిప్పర్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడి కుడి కాలు టిప్పర్ చక్రాల కింద ఇరుక్కుంది. అరగంటపాటు కాలు బయటకు రాక విలవిల్లాడాడు. అనంతరం అక్కడికి చేరుకున్న సీఐ సత్యనారాయణ రెండు జేసీబీలను రప్పించి టైరు కింద గుంత తీయించి అఖిల్ కాలును బయటకు తీశారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓవైపు కళ్లముందే తల్లి చనిపోవడం.. కుమారుడు కదిలే పరిస్థితి లేకపోవడం.. అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. టిప్పర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande