
అమరావతి, 13 జూన్ (హి.స.)
అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న(శుక్రవారం) తిరుపతిలో జరిగిన 2047 బహిరంగ సభలో ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారన్నారు. రెండేళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి, ప్రణాళికలను ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో సరికొత్త మార్పులు తెచ్చామని తెలిపారు. ఎవరు ఆస్పత్రికి వచ్చినా ఆ రికార్డును డిజిటల్ చేశామన్నారు.
రెండేళ్లలో హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులు తెచ్చామని మంత్రి తెలిపారు. ప్రజలు ఈ సేవల ద్వారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గొప్పగా చెబుతున్నామన్నారు. ఇందుకు సహకారం అందజేసిన అధికారులందిరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్య శాఖలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు పని చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేడు ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం నెలకొల్పామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. తమకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో బాధ్యతతో మెలిగే ప్రతిపక్షం లేదని.. గత ఐదేళ్ల కాలంలో జగన్ ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల తాము చాలా సమర్ధనీయంగా పని చేశామన్నారు. తమకు ఛాలెంజింగ్ పని అప్పగించిన జగన్కు కూడా ధన్యవాదాలు అని అన్నారు.
నేడు ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలను సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. రియాక్టివ్, క్యూరేటివ్ స్థాయి నుంచి ప్రిడెక్టీవ్ విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ముందుగానే వారి సమస్యలను గుర్తించి అవసరమైన మందులు అందిస్తున్నామని తెలిపారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. మీడియా కూడా తమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఎక్కడా ఎటువంటి సమస్య ఉన్నా... తమ దృష్టికి తెచ్చి పరిష్కారం అయ్యేలా చేశారన్నారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ