
తిరుమల, 13 జూన్ (హి.స.)
కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చే వేలాది మంది శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
అన్నప్రసాద వితరణలో ప్రస్తుతం వడ్డిస్తున్న ఏడు రకాల వంటకాలతో పాటు అదనంగా ‘పప్పు’ను కూడా చేర్చాలన్న భక్తుల విజ్ఞప్తిపై టీటీడీ సానుకూలంగా స్పందించింది.
రాబోయే పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చించి అధికారికంగా అమలు చేయనున్నారు. భక్తుల ఆకలి తీర్చే పవిత్ర లక్ష్యంతో 1985 ఏప్రిల్ 6న అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించిన నిత్యాన్న పథకం, నేడు ‘శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు’గా 41 వసంతాలు పూర్తి చేసుకుని 42వ ఏట అడుగుపెట్టింది.
ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంతో పాటు క్యూలైన్లు, తిరుపతిలోని బస్ స్టాండ్లు, ఆసుపత్రుల్లో నిత్యం 2 లక్షల మందికి, పర్వదినాల్లో 3 లక్షల మందికి పైగా ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. భక్తుల ఆదరణతో ఈ ట్రస్ట్ పేరిట రూ.2,553 కోట్ల విరాళాలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. భక్తులు యధాశక్తి ఈ అన్నదాన ట్రస్టుకు విరాళాలు ఇవ్వొచ్చు. తిరుమల వచ్చే భక్తులకు ఒక్కరోజు అన్నదానం చేయాలనుకునే దాతలు రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. టీటీడీ సేకరించిన ఫీడ్బ్యాక్లో 98 శాతం మంది భక్తులు అన్నప్రసాద నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, పప్పును కూడా చేర్చాలని కోరారు. దీంతో నాణ్యమైన పప్పు దినుసులు, బియ్యం సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్ల అసోసియేషన్లతో టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కల్తీకి తావులేకుండా ట్రేడర్ల నుండి కాకుండా నేరుగా మిల్లర్ల నుంచే ముడిపదార్థాలు కొనుగోలు చేసేందుకు ‘ఎంపానల్’ వ్యవస్థ ద్వారా సరికొత్త పారదర్శక విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అన్నం, వెజిటబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్నీ, చక్కెర పొంగలితో పాటు వడ అందిస్తుండగా.. త్వరలోనే శ్రీవారి ప్రసాదంలో పప్పును చేర్చే ప్రతిపాదనపై టీటీడీ పాలకమండలి..తదుపరి సమావేశంలో చర్చించబోతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV