
అమరావతి, 14 జూన్ (హి.స.)
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి.. సొంత మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమాలు, అవినీతికి నిలువెత్తు రూపం అయిన వైసీపీ వారికి నైతికత, ప్రతిభ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు. కూటమి హయాంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ అధినేత జగన్ బురద చల్లుతున్నారని అన్నారు. 2019లో నిర్వహించిన సచివాలయ నియామక పరీక్షల్లో ఏపీపీఎస్సీ ఆఫీసులో ఎగ్జామ్ సెక్షన్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి అనితారెడ్డికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 పరీక్షలో 150కి 112.5 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిందని, అలాగే పరస్పర విరుద్ధమైన కేటగిరీలు ఆర్ట్స్, సైన్స్ రెండింటిలో టాప్ ర్యాంకర్గా నిలిచిన దొడ్డ వెంకట్ రెడ్డి ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ డేటా విభాగం సంరక్షక డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డికి తమ్ముడు కాదా? అని ప్రశ్నించారు. 90 శాతం ఉద్యోగాలు మన కేడర్కే వచ్చాయంటూ ఆనాడు విజయసాయిరెడ్డి మాట్లాడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు కూటమిపై బురద చల్లడం మానుకోవాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ