
అమరావతి, 14 జూన్ (హి.స.)
‘జలధార- జలహారతి’ పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలధారపై జల వనరుల శాఖ, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్, సీఎంవో కార్యదర్శి రాజమౌళి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొన్నారు. ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకునేలా పనులు చేపట్టి కాలువలు, కరకట్టలు పటిష్ఠపరచాలని సూచించారు. నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. చిన్న చెరువుల ద్వారా సాగుకు నీరందించడంతో పాటు భూగర్భ జల మట్టాలనూ పెంచవచ్చన్నారు. ఈ నెలాఖరులోగా ‘జలధార- జలహారతి’ పనులు పూర్తి చేయాలని సూచించారు.
దీనికింద చెక్డ్యామ్ల నిర్మాణంతో పాటు ఇంకుడు గుంతలు, ఫామ్పాండ్లు, కాంటూరు కందకాల తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధిని మోడల్గా తీసుకోవాలని చెప్పారు. జలధార-జలహారతి విషయంలో ప్రతి జిల్లా ఆదర్శంగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ