
అమరావతి, 14 జూన్ (హి.స.)
గంగవరం(పలమనేరు), బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయదీప్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గత వారం జయదీప్.. ఓ యువతి ఫోన్ చేసి రమ్మని చెప్పిందని గంగవరం మండలం దండపల్లెకురప్పల్లె గ్రామానికి వెళ్లారు. అక్కడ మిద్దెపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని, చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామని గ్రామస్థులు యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఆ గ్రామానికి వచ్చి మెరుగైన చికిత్స కోసం తమిళనాడు రాష్ట్రం వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు శనివారం మృతిచెందాడు.
కొట్టి చంపారని ఆరోపణ..
జయదీప్ను.. యువతి తరఫున వారు కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడు మిద్దె పైనుంచి కింద పడి గాయపడినట్లు యువతి కుటుంబీకులు వాదిస్తున్నారు. ఈ నెల మూడో తేదీన జయదీప్ను.. బంగారుపాళ్యానికి చెందిన వినీత్, కల్యాణ్ మోటారు సైకిల్పై ఒక పథకం ప్రకారం దండపల్లెకురప్పల్లె గ్రామానికి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి గ్రామానికి రావాలని ఫోన్ ద్వారా తెలపడంతో అతడు వెళ్లినట్లు మరో వాదన వినిపిస్తోంది. అదేరోజు రాత్రి అతడు.. అమ్మాయి ఇంటి వద్ద తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదవశాత్తు గాయపడ్డాడా..? ఎవరైనా కొట్టి గాయపరిచారా..? అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. తమకు న్యాయం చేయాలని ఇది హత్య కేసుగా నమోదు చేయాలని మృతుడి కుటుంబీకులు కోరుతున్నారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ