
వేములవాడ, 14 జూన్ (హి.స.)
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అట్లనే కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, గత ప్రభుత్వ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే గ్రామాలకు మండలానికి కనెక్ట్ చేసేలా కేంద్రం నుంచి తగిన నిధులొస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం గ్రామం వద్ద స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ -సిరికొండ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బొల్లారం నుండి సిరికొండ వరకు రూ.23కోట్లతో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో భాగంగా వేములవాడ నుండి సిరికొండ వరకు దాదాపు 18.21 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ, బలోపేతం చేసే పనులకు ఆది శ్రీనివాస్ కలిసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, కేంద్రం సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ పనులకు 23 కోట్లు మంజూరు చేసిందని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని గడువు విధించినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..