తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్
తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్
ttd


తిరుమల 14 జూన్ (హి.స.)

కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలను బేఖాతరు చేస్తూ రాజకీయ ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కొందరు జనసేన కార్యకర్తలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో 'పవన్ కల్యాణ్ అనే నేను' అనే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో రీల్స్ చిత్రీకరించారు. ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో వారు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లు వాడటం, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం అని తెలిసినప్పటికీ, వారు ఈ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావులేదని టీటీడీ స్పష్టమైన నిబంధనలను అమలు చేస్తోంది. కొండపై రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు, నినాదాలు, ప్రసంగాలు పూర్తిగా నిషేధం. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయరాదని ప్రముఖులకు సైతం టీటీడీ సూచిస్తుంటుంది. ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.

అంతేగాక ఆలయ మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో సెల్ఫోన్ల వాడకం, ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై కఠినమైన నిషేధం అమలులో ఉంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టినా, కొందరు యాత్రికులు నిబంధనలను అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ కఠినంగా వ్యవహరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande