
బాపట్ల, 15 జూన్ (హి.స.)జిల్లాలో రన్నింగ్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు లక్ష్యంగా దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. రైలు బాపట్ల - అప్పికట్ల స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో.. నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించడానికి దుండగులు ప్రయత్నించారు. అయితే, ప్రయాణికులు అప్రమత్తమై దొంగలను ప్రతిఘటించి గట్టిగా కేకలు వేశారు.
ప్రయాణికుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో కంగుతిన్న దొంగలు, వెంటనే రైలు చైన్ లాగారు. రైలు ఆగగానే కిందకు దూకేశారు. రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, పారిపోతున్న దుండగులపైకి కాల్పులు జరిపారు. చీకటి కావడంతో దొంగలు సులువుగా తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు ఈ దోపిడీ ముఠా కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Updated Date - Jun 15 , 2026 | 07:21 AM
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ