ఇంకా దొరకని చిన్నారి ఆచూకి
ఇంకా దొరకని చిన్నారి ఆచూకి
ఇంకా దొరకని చిన్నారి ఆచూకి


తుని,, 15 జూన్ (హి.స.)గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలవుతున్నాయి.. అయినా అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) జాడ దొరకలేదు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నెల 6న చిన్నారి అదృశ్యం కాగా 9 రోజులుగా పోలీసు బృందాలు గాలింపు, దర్యాప్తు చేపడుతున్నాయి. అదృశ్యమైన సమయంలో చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చి మృతి చెందిన శునకానికి ఆదివారం పోస్ట్మార్టం పూర్తి చేశారు. అంబులెన్స్లో ఎన్.సూరవరం గ్రామంలోని పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య బృందాల పర్యవేక్షణలో పోస్ట్మార్టం జరిగింది. శునకం శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించారు. వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నారు. ల్యాబ్లో పరీక్షించిన తర్వాత నివేదికకు అనుగుణంగా మరణానికి కారణాలపై స్పష్టత రానుంది.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్, వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్ బృందం అటవీశాఖ ఆధ్వర్యంలోని త్వరిత స్పందన, రక్షణ వాహనాల్లో చేరుకున్నారు. తోట, కొండ ప్రాంతాన్ని అణువణువు గాలించారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించారు. కొండపై అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు చేరుకుని పరిశీలించారు. హోంశాఖ మంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మానవ ప్రయత్నంతో పాటు, సాంకేతికత ఆధారంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. విస్తృత దర్యాప్తు, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారి కోసం ఆందోళన చెందుతున్నారు.

300మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన సమయంలోనూ ఎటువంటి జంతువుల ఆనవాళ్లు లభ్యం కాలేదు. ఫోన్కాల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అనుమానితులను విచారిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా బృందాలు గాలింపు చేస్తున్నాయి. ఏడు టవర్ల పరిధిలో సుమారు 4,800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిని విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande