గుంటూరు.మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ
గుంటూరు.మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ
గుంటూరు.మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ


గుంటూరు,, 15 జూన్ (హి.స.) :గుంటూరు మిర్చి ఎగుమతులకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు ఎక్స్పోర్టు కంపెనీలకు చెందిన సరుకును అక్కడి కస్టమ్స్ అధికారులు తిరస్కరించారు. ఆ కంటైనర్లలోని మిర్చిలో పరిమితికి మించి మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల గుంటూరు కేంద్రంగా ఉన్న మిర్చి ఎగుమతి కంపెనీలు చెన్నై షిప్యార్డు నుంచి చైనాకు కంటైనర్లలో సరుకు పంపించాయి. వాటిల్లో కొన్నింటిని అక్కడి కస్టమ్స్ అధికారులు ర్యాండమ్గా తనిఖీ చేయగా.. మిథామిడోపాస్ అనే కెమికల్ను పంట సాగులో వినియోగించినట్లు తేలింది.

మూడు కంపెనీలకు చెందిన కంటైనర్లను నిలిపేశారు. ‘ఇకపై మీరు మా దేశానికి మిర్చిని ఎగుమతి చేయొద్దు.. అంటూ కస్టమ్స్ విభాగం నిర్దిష్టమైన ఆదేశాలతో కూడిన ఓ లేఖ కూడా విడుదల చేసింది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాగా, అప్పట్లో స్పైసెస్ బోర్డు జోక్యం చేసుకొని ఎలాగోలా ఎక్స్పోర్ట్ ఆర్డర్లను పాస్ చేయించింది. ఏటా గుంటూరు నుంచి చైనాకు 20 వేలకు పైగా కంటైనర్లలో మిర్చి ఎగుమతి జరుగుతుండగా.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామం మిర్చి రైతులు, వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సరుకు తిరస్కరణకు గురైన ఆ మూడు కంపెనీలు ఏంటి? అనే దానిపై చర్చ నడుస్తోంది. కాగా, మిథామిడోపాస్ పురుగుమందు వాడి సాగు చేసిన మిర్చి పంటను చైనా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆ కెమికల్ తయారీ లైసెన్సును రద్దు చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఈ విషయంపై సోమవారం ఉద్యానశాఖ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని మిర్చి ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ నేత తోట రామకృష్ణ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande