
తిరుమల, 15 జూన్ (హి.స.)
కలియుగ వైకుంఠం క్షేత్రం అయిన తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవుల ముగింపు దశకు రావడంతో స్వామివారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఉన్న వారికి తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు నిరంతరాయంగా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే నిన్న (ఆదివారం) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 95,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు గాను 35,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో నిన్న శ్రీవారి హుండీకి వచ్చిన ఆదాయం రూ.3.93 కోట్లుగా నమోదైనట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వర్షాలు పడుతుండటంతో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు ఓపికతో వ్యవహరించాలని, అధికారుల సూచనలను పాటించి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV