
తిరుమల, 15 జూన్ (హి.స.)
తిరుమల పుణ్యక్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రచార వీడియోను చిత్రీకరించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమానులు క్షమాపణలు కోరారు. తమ వల్ల పొరపాటు జరిగిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమించాలని కోరుతూ వారు మరో వీడియోను విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే, శనివారం నాడు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని అఖిలాండం వద్ద ఇద్దరు యువకులు, ఒక వృద్ధురాలు 'పవన్ కల్యాణ్ అనే నేను' అనే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదాస్పదంగా మారింది.
సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో, వీడియోలో ఉన్న అభిమానులు ఆదివారం స్పందించారు. తాము చేసిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తున్నామని, భక్తులందరూ తమను క్షమించాలని కోరారు. కేవలం అతి ఉత్సాహంతోనే ఈ పని చేశామని, దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు వారు అంగీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi