
అమరావతి, 16 జూన్
వైసీపీ హయాంలో రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం తెలంగాణకు వెళ్లిపోయిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆ ఐదేళ్లలో ఆదాయం, ప్రజల ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో ఎక్సైజ్ శాఖను తిరిగి గాడిలో పెట్టిందన్నారు. ఎక్సైజ్ శాఖలో రెండేళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలపై మంత్రి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరించారు. 2014-19 మధ్య కాలంలో ఏపీ కంటే తెలంగాణ రూ.4186 కోట్లు అదనంగా మద్యం అమ్మితే, 2019-24 మధ్య ఏకంగా రూ.42762 కోట్లు అదనంగా అమ్మిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు పెట్టి వైసీపీ నాయకులకు చెందిన నాసిరకం బ్రాండ్లు విక్రయించడం, మద్యం ధరలు ఒకేసారి 75శాతం పెంచడంతో రాష్ట్రంలో అమ్మకాలు పడిపోయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రవేశించిందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ షాపులు ఏర్పాటుచేసి ఏపీ ప్రజలకు మద్యం అమ్మారని తెలిపారు.
ఫలితంగా ఐదేళ్లలో రూ.18,860 కోట్ల రాష్ట్ర ఆదాయం పక్క రాష్ర్టాలకు వెళ్లిపోయిందన్నారు. సబ్ లీజుల పేరుతో 60శాతం డిస్టిలరీలను ఆక్రమించుకుని, రాష్ట్రంలో ఎంఎన్సీ కంపెనీల బ్రాండ్లు లేకుండా చేశారని, దీనివల ఎంఎన్సీ బ్రాండ్ల అమ్మకాలు 51.23శాతం నుంచి 5.25శాతానికి పడిపోయాయన్నారు. ఐదేళ్లలో రూ.99413 కోట్ల అమ్మకాలను నగదు రూపంలో చేస్తే, డిజిటల్ లావాదేవీలతో అమ్మిన మద్యం కేవలం రూ.615 కోట్లు అని తెలిపారు.
నాణ్యమైన బ్రాండ్లను తిరిగి ప్రవేశపెట్టామన్నారు. పేదలపై భారం పడకుండా క్వార్టర్ రూ.99 బ్రాండ్లు తీసుకొచ్చామన్నారు. దీనివల్ల ఎన్డీపీఎల్ తగ్గిపోయి ఇక్కడ అమ్మకాలు పెరిగి మన ఆదాయం మనకే వస్తోందన్నారు. వైసీపీ హయాంలో రెండు ముక్కలు చేసిన ఎక్సైజ్ శాఖను తిరిగి ఒక్కటిగా మార్చి ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేశామన్నారు. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్ లావాదేవీలు 60శాతానికి చేరుకున్నాయని చెప్పారు. ములకలచెరువు ఘటనలో జోగి రమేష్, ఆయన సోదరుడు ఉన్నారని, మొత్తం 37 మందిని అరెస్టు చేశామన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకే బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ