
మంచిర్యాల, 16 జూన్ (హి.స.)
మావోయిస్టులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అడవిలో అన్నలు ఉంటే సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు. కానీ ఇప్పుడు అడవిలో అన్నలు లేరు కాబట్టి అడిగే దిక్కులేదని సింగరేణి (singareni) యాజమాన్యం అనుకుంటోంది. కానీ అన్నలందరూ ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు. బిడ్డా.. గుర్తుపెట్టుకోండి. కార్మికులకు ఇబ్బంది పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆకే౯7 భూగర్భ గనివద్దకు వెళ్లిన కవిత అక్కడ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కవితను సింగరేణి సిబ్బంది అడ్డుకోగా కవిత తన అనుచరులతో కలిసి గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా సింగరేణి సిబ్బందికి, హెచ్ఎంఎస్ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అనంతరం మాట్లాడిన కవిత మావోయిస్టులు మాతోనే ఉన్నారని కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. కార్మికులను వేదించడం ఆపాలన్నారు. లాభాల వాటాల్లోనూ ప్రతియేడాది కార్మికులకు సింగరేణి యాజమాన్యం నష్టం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలోని మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవని ఇకనైనా ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. సింగరేణిలో ఇప్పటికీ పాత టెక్నాలజీ వాడుతుండటం ఏంటని నిలదీశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ విస్తరించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..