
అమరావతి, 21 జూన్ (హి.స.)
దేవీపట్నం, ఎట్టకేలకు పెద్దపులి పాపికొండలు అభయారణలోకి వెళ్లింది. గత మూడు నాలుగు రోజులు పాటు దేవీపట్నం, తొయ్యేరు, మంటూరు పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి శనివారం నాటికి కచ్చులూరు- కె.గొందూరు పరిసర ప్రాంతాల్లో కదలికలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పోశమ్మగండి నుంచి అటవీశాఖకు సంబంధించిన ఓ బోటుపై అటవీశాఖ బృందాలు గోదావరి నదిపై ఆ ప్రాంతం వరకూ వెళ్లినట్లు సమాచారం. పాపికొండలు అభయారణ్యంలోకి పులి వెళ్లడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మంటూరులో సంచరించిన పెద్దపులి అడవి పందిపై దాడిచేసి హతమార్చింది. శనివారం అటవీశాఖ సిబ్బంది దామనపల్లి మీదుగా దట్టమైన కొండమార్గంలో కచ్చులూరు, కె.గొందూరు, తాళ్లూరు, తెలిపేరు వరకూ గోదావరి ఒడ్డున యాంటెన్నాలతో పులి కదలికలను పర్యవేక్షించారు. అయితే కచ్చులూరు- కె.గొందూరు మధ్య పులి పాదముద్రలు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో పెద్దపులి కొండమొదలు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిపోయి ఉండవచ్చన్నారు. పోలవరం ముంపు గ్రామాలను వీడి పెద్దపులి అభయారణ్యం లోపలికి వెళ్లడంతో నిర్వాసితులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ