
హైదరాబాద్, 16 జూన్ (హి.స.) నల్గొండ జిల్లాకనగల్ మండలంలోని ధర్వేశిపురం (పర్వతగిరి) దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో అంబటి నాగిరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్ 24 బుధవారం ఉదయం 10:30 గంటలకు అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. జూన్ 25 గురువారం 8 గంటలకు శతకటాభిషేకం, సాయంత్రం నాలుగు గంటలకు రెండు గ్రామాల నుంచి సాంప్రదాయ బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మరియు అధికారులు తెలిపారు.
ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతరకు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు