
హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు
సంబంధించిన రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందిన వారికి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత యాసంగి సీజన్లో ప్రభుత్వం రెండు విడతలుగా, ఒక్కొక్క రైతుకు గరిష్ఠంగా రెండెకరాల వరకు సాయం అందించింది. అయితే, మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండటంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు భరోసా జరుగుతున్నట్టు సమాచారం.
పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అర్హుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి రూ.6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సీజన్కు ప్రభుత్వం సుమారు రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు రూ.1,200 కోట్లు ఆదా అవుతాయని అంచనా. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా, 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. గతేడాది సాగు చేయని సుమారు 3.50లక్షల ఎకరాలను గుర్తించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామ పరిసరాల్లోని భూములు, రోడ్లు, కాలువల కిందికి వెళ్లిన భూములు కలిపి సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు పనికిరావని తేల్చారు.
గతంలో రైతు బంధు రెండు విడతలుగా సకాలంలో జమ అవగా, ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కొంతమంది ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. పెండింగ్ రైతు భరోసా త్వరగా విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని, లేకపోతే భవిష్యత్ స్థానిక ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు