
కరీంనగర్, 16 జూన్ (హి.స.)
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే
ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని స్పష్టం చేసిన ఆయన.. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఓ ఫంక్షన్ హల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారుల ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులతో ఇక్కడి ముస్లిం సమాజాన్ని పోల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారిని తీవ్రంగా అవమానిస్తోందని, ఇందుకు గాను కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
గత పన్నెండేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 10 లక్షల కోట్లు కేటాయించిందని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్రం మరింత వేగంగా దూసుకు పోవాలంటే ఇక్కడ 'డబుల్ ఇంజన్ సర్కార్' రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలకూ అవకాశం ఇచ్చారని, ఈసారి ఒక్క అవకాశం బీజేపీకి ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు.
సమాజంలో మావోయిస్టు భావజాలం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తుపాకీ సంస్కృతి, మారణహోమంతో సాధించేది ఏమీ లేదన్నారు. ఏమీ తెలియని మైనర్ పిల్లల చేత తుపాకులు పట్టించడం అత్యంత దారుణమన్నారు. ఇప్పటికే చాలామంది లొంగిపోయారని, ఇంకా ఆ ఆలోచనల్లో ఉన్నవారు భవిష్యత్తు కోసం మారాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా' ద్వారా కేవలం సంవత్సరన్నర కాలంలోనే 12 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని బండి సంజయ్ పేర్కొన్నారు. 'కిసాన్ సమ్మాన్ నిధి', పెంచిన కనీస మద్దతు ధర (MSP) ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వదేశీ నినాదం.. 'స్టార్టప్ ఇండియా' ద్వారా దేశంలో 23 లక్షల మందికి ఉపాధి లభించిందని.. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ భారత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు