
అమరావతి, 16 జూన్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బూత్లెవల్ అధికారులు (బీఎల్వోలు) 68,868 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), 175 మంది ఈఆర్వోలు, 1,076 మంది ఏఈఆర్వోలు, 28 మంది డీఈవోలు సర్ విధుల్లో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4.16 కోట్ల మంది ఓటర్లను ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఏడాది మే 25 నాటికి ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకి బీఎల్వోలు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫామ్ (ఈఎఫ్) అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫారాల్లో ఓటర్లకు సంబంధించిన కొంత సమాచారం ముందుగానే ముద్రించి (ప్రీ ఫిల్డ్) ఉంటుందన్నారు. దాని తర్వాత ఉండే కాలమ్లో 2002 ఎలక్టోరల్ రోల్లో ఎక్కడ ఉంటే ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే అమ్మ, నాన్న, తాత, ఇలా ఓటరు కుటుంబీకులకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుందన్నారు. ఆవిధంగా నమోదు చేయలేని పక్షంలో ఈసీ నిర్ణయించిన 11 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటికే 100 శాతం ఫారాల ముద్రణ పూర్తి కాగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైందన్నారు. బీఎల్వోల ఇంటింటి సర్వే తొలిరోజైన సోమవారం 4,12,384 ఎన్యూమరేషన్ ఫామ్లను పంపిణీ చేశారని, వాటిలో 4,115 ఫామ్ల వివరాలను డిజిటలైజ్ చేశారని ఆయన తెలిపారు. బీఎల్వోల సర్వే ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ