
అమరావతి, 16 జూన్ (హి.స.)
,రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. ఏపీలో క్రైం రేటు 14.1 శాతం మేర తగ్గిందని, మొత్తంగా చూసుకుంటే 34,041 కేసులు తగ్గాయన్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న పోలీసింగ్.. క్రైం రేటు తగ్గడానికి కారణమని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక సీసీటీవీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నామన్నారు. నేరం జరిగాక 24 గంటల్లో నిందితుడిని పట్టుకోడానికి సీసీటీవీలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యమన్నారు. లక్ష సీసీ కెమెరాలు పెట్టాలని టార్గెట్గా పెట్టుకున్నామని.. ఇప్పటికే 70 శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
గత ప్రభుత్వంలో దిశ పేరుతో అమలు చేయలేని చట్టాన్ని తెచ్చారని హోం మంత్రి విమర్శించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం ఐజీ స్థాయి అధికారిని నియమించి శక్తి యాప్ను ఏర్పాటు చేశామన్నారు. శక్తి యాప్ను కోటి 50 లక్షల మంది డౌన్లోడ్ చేయడంతో పాటు వాట్సాప్ నెంబర్ను కూడా అందించామన్నారు. ఇప్పటి వరకూ తప్పిపోయిన 8,356 మందిని గుర్తించి వారి ఇళ్లకు పంపించామని అనిత తెలిపారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నామన్నారు. కొందరు ప్రభుత్వం తీసుకునే చర్యలకు భయపడి వారికి వారే శిక్షించుకున్న సంఘటనలను చూశామన్నారు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలంటే ఫోరెన్సిక్ నుంచి డిపార్టమెంట్ మొత్తం బాగా పనిచేయాలని సూచించారు.
మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల కనిపించిందని అనిత తెలిపారు. లైంగిక నేరాల్లో దర్యాప్తు నాణ్యత 31.41 శాతం నుంచి 90శాతానికి పైగా సాధించామని చెప్పుకొచ్చారు. 591 మందికి లైంగిక నేరాల కింద శిక్షలు ఖారారయ్యాయని తెలిపారు. ఈగల్ టీంను పెట్టాక నార్కోటిక్స్పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో కూడా ఇదే పేరుతో టీంను ఏర్పాటు చేసుకోవడం ఏపీకి గర్వకారణమన్నారు. గంజాయిని ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి డిస్త్రాయ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 2366 గంజాయి కేసులు నమోదవగా.. 986 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సైబర్ అరెస్ట్ల పేరుతో భయపెట్టి డబ్బులు కొట్టేస్తున్నారని.. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా వార్రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్కు సంబంధించి రూ.247 కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు. 8 వేలకుపైగా చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ను తొలగించామని అనిత పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ