హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు
హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు
ఈరోజు


బద్వేల్, 16 జూన్ (హి.స.)

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా ఈరోజు జరిగింది. దళితుల సమస్యల పరిష్కారం, ఎస్సీ–ఎస్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, దళిత సంక్షేమ పథకాల పునరుద్ధరణ తదితర డిమాండ్లతో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) బద్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానగల మునెయ్య, జిల్లా అధ్యక్షుడు నాగదాసరి ఇమ్మానియేల్, ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ కార్యదర్శి బాలు ఓబయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2024 ఎన్నికల సందర్భంగా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఉపాధి, విద్య, స్వయం ఉపాధి, భూమి పంపిణీ, గృహ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై అనేక హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో దళితులకు ఇచ్చిన హామీలను విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అమలు చేయాలని, ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా ఆయా వర్గాల అభివృద్ధికే వినియోగించాలని డిమాండ్ చేశారు.

అలాగే అర్హులైన దళిత కుటుంబాలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయించాలని, భూమిలేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల సాగుభూమి అందించాలని, నిరుద్యోగ దళిత, గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్వయం ఉపాధి పథకాలకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థులకు విద్యా సహాయం, విదేశీ విద్య, ఉన్నత విద్య పథకాలను పునరుద్ధరించడం, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడం, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande