
హైదరాబాద్, 17 జూన్ (హి.స.) ప్రభుత్వ విద్యను సరికొత్త
దిశలో నడిపించేందుకు సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' (TPS)ను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో బుధవారం ఘనంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాఠశాల భవనాన్ని ప్రారంభించి, టీపీఎస్ పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం 'అల్పాహార పథకాన్ని' ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో కలిసి స్వయంగా టిఫిన్ చేశారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 15 కోట్ల వ్యయంతో ఈ పాఠశాలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యాబోధన అందిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిజిటల్ క్లాట్రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ వంటి ఆటల కోసం ప్రత్యేక మైదానాలు, కోచ్లను అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కోసం 5 ప్రత్యేక స్కూల్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..