
హుస్నాబాద్, 17 జూన్ (హి.స.)
రేవంత్ రెడ్డి స్కూల్ పిల్లల ముందు అడ్డగోలుగా మాట్లాడారని నా ఎత్తు గురించి ఆ పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి?.. అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇవాళ ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. హరీశ్ రావు తాటిచెట్టు లెక్క పెరిగాడని అక్కడ పిల్లల ముందు చెప్తున్నాడన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే నా ఎత్తు గురించి చిల్లర మాటలు చేస్తావా రేవంత్ రెడ్డీ? నా ఎత్తుతో నీకేం పని? నువ్వు ఎగ్గొట్టిన పథకాలపై, చేస్తున్న స్కాములపై ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని నీ మెడలు వంచి తీరుతామన్నారు. రైతుబంధు, రైతుభీమా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే నా ఎత్తు గురించి మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం మానబోనన్నారు. మీ స్కామ్ లు బయట పెడుతూనే ఉంటానన్నారు.
ఇవాళ హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను నిన్ను తిట్టాలనుకుంటే నీకంటే గట్టిగా తిట్టగలనని కానీ నాకు విజ్ఞత ఉన్నదని నేను అలా తిట్టబోనన్నారు. స్కూల్లో కార్యక్రమానికి వెళ్లి మంచిగా చదువుకోవాలని మంచి మాటలు చెప్పాల్సిన సీఎం నా గురించి అడ్డగోలుగా మాట్లాడారన్నారు. దేవుడు ఇచ్చాడు నేను ఇలా పుట్టాను. నా ఎత్తుతో పేరుతో నన్ను ఎంత గిల్లినా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. త్యాగాలు బీఆర్ఎస్వి అయితే మోసాలు రేవంత్ రెడ్డివని దుయ్యబట్టారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుందన్నారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలా వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్ఐ అయితే.. జిరాక్స్ కాపీలతో డ్రామాలు ఆడి గద్దెనెక్కిన మోసాలు రేవంత్ రెడ్డివన్నారు. 85 రోజులు దాటినా రైతుబంధు లేదు, 5 నెలలుగా రైతుబీమా బంద్, యాసంగి బోనస్ ఎగ్గొట్టి అన్నదాతలను రేవంత్ సర్కార్ నిలువునా మోసం చేస్తోందన్నారు. విద్యార్థుల ఫీజులకు, పేదల ఇళ్లకు పైసలు లేవంటున్న సీఎం.. తన క్యాంప్ ఆఫీసుల సోకులకు, ఫుట్ బాల్కు మాత్రం వందల కోట్లు తగలేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ 'మిషన్ మోడ్' కాదు 'కమీషన్ మోడ్'.. అని కమీషన్లు రాని దళితబంధు, కులవృత్తుల సంక్షేమాన్ని, విద్యార్థుల ఫీజులను నిలువునా పాతరేశారని ఆరోపించారు. ఓటర్ల ముమ్మర సవరణ SIR ప్రక్రియలో కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు